Telugu News » Hyderabad : అందమైన జీవితం.. యువ వైద్యులకు గొప్ప సందేశం..!

Hyderabad : అందమైన జీవితం.. యువ వైద్యులకు గొప్ప సందేశం..!

రేపటి తరం వైద్యుల పరిచయ కార్యక్రమం. బంధు మిత్రుల ఆశీర్వాద సమ్మేళనం. ‘అందమైన జీవితం’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.

by Venu

యువశక్తి తలచుకొని మంచిపనికి ముందుకొస్తే.. భవిష్యత్తు తరాలకు భరోసా ఉంటుంది. నేటి కాలంలో నిర్జీవంగా మారుతున్న యువ తరానికి కొందరు ఆదర్శంగా నిలవడం అక్కడక్కడా కనిపిస్తుంటుంది. అలాంటి వారే వైద్య దంపతులు సామవేదం కామేశ్వరి, వింజమూరి ప్రసాద్. తాజాగా వీరు ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అది రేపటి తరం వైద్యుల పరిచయ కార్యక్రమం. బంధు మిత్రుల ఆశీర్వాద సమ్మేళనం. ‘అందమైన జీవితం’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.

తమ కూతురు రామలక్ష్మి గాయత్రి సింగపూర్ లో వైద్య వృత్తిని పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ దంపతులు ఇది తమ వేడుకగా కాకుండా, సామాజిక బాధ్యతగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న, కలిసి సాగుతున్న సమాజాన్నే ‘బంధుగణం’గా, ఆత్మీయుల సన్నిధినే ‘కుటుంబం’గా భావించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ వైద్యులను ఒకచోట చేర్చి, వారి తల్లిందండ్రుల సమక్షంలో ‘స్నాతకోత్సవానికే మలి స్నాతకోత్సవం’ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని జరిపారు.

ఈ వేడుకలో మొత్తం పది మంది వైద్యులు రేపటి డాక్టర్లు (Doctors)గా నిలదొక్కుకుంటున్న సందర్భంగా వారిని పరిచయం చేస్తూనే స్వయంగా వారి ఆలోచనలు వినిపించడం, అనుభవాలను పంచుకోవడంతో సహా హాజరైన బంధుమిత్రుల అభినందనలు, అశీర్వాదాలు పొందే సభగా మలవడం నిజంగా మరచిపోలేని అనుభూతిగా అక్కడకు వచ్చిన వారంతా చెప్పారు. ఇందులో పాల్గొన్న డాక్టర్లలో మయూఖ, ప్రజ్ఞశ్రీ, నిరంజన, సాకేతరామ, రియా పింగళి హైదరాబాద్ నుంచి రాగా బైరోజు నళిని, సాయి తేజ నిర్మల్ నుంచి వచ్చారు. దివేష్ కారుమంచి శ్రీకాకుళం, శ్రీజ కారుమంచి బెంగుళూరు, వింజమూరి రామలక్ష్మి గాయత్రి సింగపూర్ నుంచి వచ్చారు.

“డాక్టర్లు ఉన్నారు జాగ్రత్త” అని భయపడే స్థితి నుంచి మన డాక్టర్లు ఉన్నారు.. మరేం ఫరవాలేదు అన్న విశ్వాసం కలిగించిన ఈ కార్యక్రమం నిజంగానే అందమైన జీవితానికి ప్రతిబింబం అని అన్నారు. ఇందులో పాల్గొన్న వారు డబ్బుకన్నా సేవే ప్రధానంగా తమ భవిశ్వత్తును సమాజానికి అంకితం చేసేందుకు నిబద్దులవడం చూస్తే ముచ్చటేస్తుంది. వారి సంస్కారానికి పాదు పోసిన తల్లిదండ్రులకు నమస్కరించాలనిపించిందని ఈ వేడుకలో పాల్గొన్న వారు తెలిపారు.

మరోవైపు ఈ యువ వైద్యులందరికీ ఒక చిన్న సామాన్య శాస్త్రం ఫ్రేం కానుకగా అందిస్తూ, ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోంచి ఒక చిరు అధ్యాయాన్ని వారితో పంచుకున్నానని తెలిపారు వ్యాసకర్త కందుకూరి రమేష్ బాబు. విశాఖపట్నం (Visakhapatnam)లో ‘ప్రేమ’ హాస్పిటల్ వ్యవస్థాపకులు, పోలియో బారిన పడిన లక్షలాది మందికి చికిత్స చేసిన ఎస్ వీ ఆదినారాయణ గురించి రాశారు.

వారి అనుభవ సారాన్ని ఈ యువ వైద్యులకు పంచుతూ సంఘానికి ఇతోధికంగా మేలు చేయాలనుకుంటే తెలివి తేటల కన్నా (ఐక్యూ) సంవేదన (ఇక్యూ- ఇమోషనల్ కోషియన్సీ) ప్రధానంగా పనిచేయడం ఎంత అవసరమో తెలిపినట్లు వెల్లడించారు. రోగికి చికిత్స చేయడం కాదు, వారి తల్లి కన్నీళ్లు తుడవడానికి ఆ వైద్యుడు ఎలా పునరంకితం అయ్యారో ఇక్కడ తెలియజేశారు. ఎట్లా ‘నో’ అనకుండా ఆయన సేవానిరతి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొనేలా చేసింది.

అదీగాక కోట్లాది ప్రజల హృదయాల్లో ఆయన దేవుడిగా ఎలా నిలిచారో విడమర్చి చెప్పే ప్రయతం చేశారు. ఇట్లా హాజరైన అందరూ పిల్లలు పెద్దలుగా మారే ఈ కీలక దశలో ఇవ్వాల్సిన మార్గదర్శకత్వం ఇచ్చానని తెలిపారు. స్ఫూర్తివంతమైన ఈ వినూత్న కార్యక్రమం నారాయణగూడ (Narayanaguda)లోని, తాజ్ హోటల్ (Taj Hotel) వేదికగా జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మంచి భోజనం, ఆట పాటలతో సాయంత్రం దాకా గడిపి రేపటి పట్ల మరింత విశ్వాసంతో వెనుదిరిగామని తెలిపారు

You may also like

Leave a Comment