ఫోన్ ట్యాపింగ్ (Phone Tamping)కేసులో తవ్విన కొద్ది పలు సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.. ఇప్పటికే ఈ కేసుపై సీరియస్ గా ఫోకస్ చేసిన అధికారులు.. ప్రస్తుతం మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. సస్పెండైన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో ఆ వివరాలను పొందుపరిచారు. అదేవిధంగా ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు మొదట సహకరించ పోయినప్పటికీ తర్వాత కీలక విషయాలు వెల్లడించారని సమాచారం.
అలాగే భుజంగరావు, తిరుపతన్నలు సైతం స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ నివేదికలో పోలీసులు (Police) పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు, తిరుపతన్న కుట్ర ఉన్నట్లు పొందుపరిచారు. మరోవైపు ప్రణీత్ రావు (Praneeth Rao)హార్డ్ డిస్కులను డిసెంబరు 4న మూసీలో పడేసినట్లు ఒప్పుకొన్నారని.. ఈ సమాచారం మేరకు నాగోలు (Nagolu) మూసీలో హార్డ్ డిస్క్ శకలాలు వెలికి తీశామన్నారు.
మూసీ వద్దకు ప్రణీత్ రావును తీసుకెళ్లి అక్కడ 5 ధ్వంసమైన హార్డ్ డిస్క్ కేస్ లు, మెషీన్ తో కట్ చేసిన తొమ్మిది హార్డ్ డిస్క్ ముక్కలు స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు.. అలాగే 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలు సైతం స్వాధీనం చేసుకొన్నట్లు నివేదికలో తెలిపారు. అంతేకాకుండా ప్రణీత్ చెప్పిన సమాచారంతో ఎస్ఐబీ (SBI) కార్యాలయంలో కూడా పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
అదేవిధంగా 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్ టాప్, మానిటర్, పవర్ కేబుళ్లు ఎస్ఐబీ కార్యాలయంలో స్వాధీనం చేసుకొన్నారు. ఎలక్ట్రిషియన్ గదిలో ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని, ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగులు సైతం స్వాధీన పరచుకొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎస్ఐబీ కార్యాలయం సీసీ ఫుటేజి లాగ్ బుక్ ప్రతులు సేకరించారు. ఈ క్రమంలో ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు. ప్రతిపక్షాల అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్లు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు..