పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు ఏమాత్రం ఏమరుపాటుగా ప్రవర్తించినా అది వివాదాస్పదంగా మారుతుంది. వారి మాటలు, చర్యలు ఎవరిని వేలెత్తి చూపించే విధంగా ఉండకుండా చూసుకోవలసిన క్షణాలు ఇవి.. లేదంటే విమర్శలు, ఆరోపణలు ఎటువైపు నుంచి తగులుతాయో ఊహించడం కష్టం. అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటన చోటు చేసుకొంది.
హైదరాబాద్ (Hyderabad) బీజేపీ (BJP) అభ్యర్థి కొంపెల్లి మాధవిలత (Kompella Madhavi Latha) మాటల్లో ఎంత ఘాటు ఉంటుందో అందరికీ తెలిసిందే.. అయితే ప్రస్తుతం మాటలతో కాకుండా.. ఆమె చేతలతో వివాదంలో చిక్కుకొన్నారు. కావాలని చేశారా ?.. రెచ్చగొట్టాలని చేశారా ?.. అనేది మ్యాటర్ కాదు. కానీ ప్రస్తుతం ఈ అంశం వివాద స్పందంగా మారి.. నెటిజన్ ఆగ్రహానికి, కామెంట్స్ కి గురికావలసి వచ్చింది.
ఇక నిన్న నగరంలో నిర్వహించిన శ్రీరామ నవమి శోభాయాత్ర (Sri Ram Navami Shobhayatra) సందర్భంగా వాహనంపై ర్యాలీగా వెళ్తున్న మాధవిలత.. ఓ మసీదు వద్ద బాణం వేసినట్లుగా సంజ్ఞ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ఆమె మసీదుపై బాణం వేస్తున్నట్లు రెచ్చగొడుతున్నారనే భావన నిప్పురవ్వలా రగిలించారు..
ఇది ఆమోదయోగ్యం కాదని ఆమె చర్యల వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతినే అవకాశాలున్నాయని మండిపడుతున్నారు. మరికొందరు ఆమె ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు చేయలేదని కేవలం కెమెరా పర్ స్పెక్షన్ లో చేసిందని సమర్థిస్తుండగా.. మాధవిలత విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.. హైదరాబాద్ లో బీజేపీని ఓడించి ఎంఐఎంను గెలిపించే ప్రయత్నంలా ఆమె తీరు ఉందని వ్యాఖ్యానించారు.