బీఆర్ఎస్(BRS) దానం నాగేందర్ (Danam Nagendar) అనర్హత పిటిషన్ వ్యవహారంలో హైకోర్టును (High Court) ఆశ్రయించింది. పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ (Congress)లో చేరిన దానంపై, అనర్హత వేటు వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే సభాపతి గడ్డం ప్రసాద్ వద్ద అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. సభాపతి ఇంకా స్పందించడం లేదని ఫిర్యాదులో వెల్లడించింది.
ఈ అంశంపై త్వరగా చర్యలు తీసుకోవాలని సభాపతిని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును ప్రకటించిందని తెలిపింది. ఈ వ్యవహారంలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం వరకు నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
మూడు నెలల్లో అనర్హతా పిటిషన్లను తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. దానం నాగేందర్‌పై ఇప్పటికే అనర్హతా పిటిషన్ వేయడంతో పాటు అనుబంధ అఫిడవిట్ కూడా దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.. దానం నాగేందర్, కడియం శ్రీహరిల శాసనసభ్యత్వాలు రద్దవుతాయని, అలాగే ఉపఎన్నికలు రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు..
గతంలో ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్‌రెడ్డి తెలిపిన మాటలను గుర్తు చేసిన కేటీఆర్.. ఇప్పుడు ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్న ఎవరిని రాళ్లతో కొట్టాలన్న మందకృష్ణ మాదిగ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ తాజాగా దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై హైకోర్టు మెట్లు ఎక్కింది..