పోలీస్ రిక్రూట్మెంట్లో (Police Recruitment) రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించిన జీవో 46ను రద్దు చేయాలని ఆందోళన మొదలైంది. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 46 వల్ల ఉమ్మడి హైదరాబాద్ (Hyderabad) అభ్యర్థులకే అధిక మేలు జరుగుతుందని ఆరోపిస్తూ.. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు మెరిట్లో మార్కులు తెచ్చుకున్న.. ఈ జీవో వల్ల ఉద్యోగాలు పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పాత పద్ధతిలో నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఇందిరాపార్కు (Indira Park) వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు కాంగ్రెస్ (Congress) నేత బక్క జడ్సన్ (Bakka Judson) మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అభ్యర్థులు కీలక వ్యాఖ్యలు చేశారు.. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో నెం. 46 నుంచి పోస్ట్ కోడ్ నెం. 24 టీఎస్ఎస్పీ పోస్టులు మినహాయించాలని, కానిస్టుబుల్ విద్యార్థుల పోరాట సమితి ప్రభుత్వానికి, ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేసింది.
తల్లిదండ్రులు, విద్యార్థులు జీవో నెం. 46 గురించి తెలుసుకోకపోతే భవిష్యత్తు తరాలు చాలా నష్టాపోతాయని కానిస్టేబుల్ పోరాట సమితి తాజాగా ఓ లేఖ విడుదల చేసింది. 2014,2016,2018 పోలీస్ రిక్రూట్మెంట్ లో పోస్టు కోడ్ నెం. 24 టీఎస్ఎస్పీ అనే స్టేట్ పోస్ట్‌ను ఈ 2022 నోటిఫికేషన్లో జిల్లాల పోస్టుగా మార్చి మెరిట్ సాధించిన చాలా మందికి అన్యాయం చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు.
సీ.డీ1, సీ.డీ2 ప్రకారం రిజల్ట్స్ ఇచ్చి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కానిస్టేబుల్ ఫైనల్ రాత పరీక్షలో 4 తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ రిజల్ట్స్ ఇవ్వాలని, హైకోర్టు ఆర్డర్స్‌ను అమలు చేయాలని, తెలంగాణ నిరుద్యోగ కానిస్టేబుల్ విద్యార్థులకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ పోరాట సమితి విజ్ఞప్తి చేశారు.