సంక్రాంతి పండుగ సంబురంగా జరుపుకొందామని భావించిన వారిలో కొందరికి విషాదం మిగులుతోంది. మనుషుల ప్రాణాలు తీస్తున్న గాలిపటాలవల్ల తెలంగాణలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు సమాచారం. మరోవైపు ఇలాంటి వేర్వేరు సంఘటనలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరు పిల్లలు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతోన్నారు.
హైదరాబాద్ (Hyderabad), మధురానగర్ (Maduranagar)లో ఐదంతస్తుల భవనంపై నుంచి చౌహన్ దేవ్ అనే యువకుడు కింది పడిపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఘటనకు ముందు స్నేహితులు గాలి పటం ఎగురవేసేందుకు ఐదవ అంతస్తు పైకి చౌహన్ దేవ్ ని తీసుకెళ్లారు. ఇంతలో ఏమైందో ఏమోగాని ఐదవ అంతస్తు నుంచి ఆ యువకుడు కింద పడిపోయినట్టు తెలుస్తోంది. ఖంగారుపడిన స్నేహితులు కిందికి పరుగులు తీశారు.
అప్పటికే చౌహన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్నేహితులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి విగతజీవిగా పడివున్న కొడుకుని చూసి విలపించారు.. చౌహాన్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రహ్మత్ నగర్ (Rahmat Nagar)లో ఉంటున్న ఆరుగురు స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకొన్న మధురానగర్ పోలీసులు. వివిధ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు జగిత్యాల (Jagityala) జిల్లా, కోరుట్ల (Korutla) పట్టణం, భీమని దుబ్బ ప్రాంతానికి చెందిన ఇద్దరు పిల్లలు ఇంటి డాబా పైన గాలిపటాలు ఎగురవేస్తున్న సమయంలో.. అవి హై టెన్షన్ వైర్లకు చిక్కుకొన్నాయి, వాటిని తీసేందుకు వెళ్లిన ఇద్దరు పిల్లలకు షాక్ తగలడంతో అపస్మారక స్థితికి చేరుకొన్నట్టు సమాచారం.
దీంతో వారిద్దరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. అలాగే జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగో తరగతి చదువుతున్న భావన సాయి (9) పతంగి ఎగరేస్తూ బిల్డింగ్ మీద నుంచి కిందపడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందాడు.