ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో పరువుహత్య చోటుచేసుకుంది. కూతురు ఓ యువకున్ని ప్రేమించిందని తల్లి కర్కశంగా వ్యవహరించింది. కన్న కూతురుకు చున్నీతో ఉరేసి చంపేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం పరిధిలో దండుమైలారం (Dandumailaram)లో జంగమ్మ కుటుంబం నివాసముంటోంది.
ఆమెకు ఇద్దరు పిల్లలు. కూతురు భార్గవి(Bhargavi) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఆమె చదువుతున్న కాలేజీలో శశి(shashi) అనే యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులు స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రాను రాను వీరిద్దరూ ఎక్కువగా కలవడం, మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం కాస్త భార్గవి కుటుంబ సభ్యులకు తెలియడంతో రచ్చరచ్చ చేశారు. శశిని కలవకూడదని, పరువు పోతోందని కూతురు సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించారు.
చదువుపై శ్రద్ధ పెట్టాలని భార్గవి తల్లి జంగమ్మ మందలించింది. అయినా భార్గవి కుటుంబాన్ని, తన తల్లి చెప్పిన మాటలను పక్కన పెట్టి శశిని కలవడం మానలేదు. దీంతో వీరి ప్రేమ వ్యవహారం కుటుంబంలో గొడవలకు దారితీసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భార్గవి తల్లి నిరాకరించింది. చాలా రోజుల నుంచి భార్గవి కనిపించకపోవడంతో శశి ఆమె ఇంటికి వచ్చాడు. దీంతో అది చూసిన తల్లి జంగమ్మ ఆగ్రహంతో ఊగిపోయింది.
శశి ఇంటికి ఎందుకు వచ్చాడని తల్లి జంగమ్మ రెచ్చిపోయింది. కూతురు భార్గవి ఏం చేస్తుందో ఏమో అని భయపడి చివరకు కన్న కూతురినే చీరతో ఉరేసి చంపేసింది. ఏమీ ఎరుగనట్లు కూతురు చనిపోయిందంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కన్నతల్లే భార్గవిని చంపిందని కేసు పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భార్గవిని చంపింది తల్లి కాదు.. ప్రియుడు..?
పరువు హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్గవి సోదరులు, ప్రియుడు శశిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో భార్గవి తండ్రి మాట్లాడుతూ.. కన్న తల్లి ఎక్కడైనా కూతురును హత్య చేస్తుందా..? అని ప్రశ్నించాడు. సోమవారం మధ్యాహ్నం తన భార్య ఇంటి నుంచి వచ్చేసరికి శశి ఇంట్లో ఉన్నాడని, తన భార్య రావడం చూసి పారిపోయాడని వెల్లడించాడు.
శశి తన కూతురు భార్గవిని చంపి పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. భార్గవిని తమ మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నామని, అయితే భార్గవి మాత్రం శశినే పెళ్లి చేసుకుంటానని మొండికేసిందని తెలిపాడు. కూతురు మృతిచెందడం చూసి తన భార్య మాట్లాడలేని స్థితిలో కూర్చుండిపోయిందని, అది చూసిన తన కుమారుడు తన తల్లే చంపినట్లు భావించి పోలీసులకు చెప్పాడని తెలిపాడు. తన భార్య కూతురును హత్య చేయలేదని తెలిపాడు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సివుంది.