అధికార కాంగ్రెస్ రాజధాని పరిధిలో మూడు ఎంపీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. దీంతో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఎన్నికల భేరీ మోగడంతో కాంగ్రెస్(Congress)లోకి గేట్లు తెరిచామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నుంచి మరింత మంది టచ్‌లో ఉన్నారనే ఊహగానాలు ఊపందుకున్నాయి.
ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Ex Minister Jagadeesh Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి గేట్లు తెరిచినా బీఆర్ఎస్‌కు ఏమీ కాదని అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు వసూళ్లకు తప్ప పాలించడానికి పనికిరారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులుగా బీఆర్ఎస్‌పై విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదని హితవు పలికారు. అసలు ఒక్క గ్యారంటీ అయినా సక్రమంగా అమలు చేశారో లేదో చూసుకోవాలని సూచించారు. వందరోజుల కాంగ్రెస్ పాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండంగా భావించాలన్నారు. తాము టికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన వారినే కాంగ్రెస్, బీజేపీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఒకే రోజు సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మరింత మంది నగర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట.