పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా చర్యలు తీసుకొంటున్నారు.. అయిన డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట పడటం లేదు. ఈ క్రమంలో తాజాగా సైబరాబాద్ (Cyberabad) పోలీసు కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో డబ్బుపట్టుబడింది. ఎస్ఓటీ టీమ్స్, వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బందితో కలిసి ఈ భారీగా నగదు పట్టుకొన్నారు.
ఈ నేపథ్యంలో పట్టుకొన్న రూ 1,96,70,324 నగదును పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్ బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాలలో సరైన క్యూఆర్ కోడ్లు, ఎన్నికల సంఘం విధానాలు అనుసరించకుండా తరలిస్తున్న రూ. 1,81,70,324ల నగదును సీజ్ చేశారు. ఇందులో రూ. 15లక్షలను మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ వాహనంలో అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.
అలాగే ఎస్ఓటీ మేడ్చల్ (Medchal) టీమ్ బ్రింక్స్ క్యాష్ లాజిస్టిక్స్ వాహనంలో తరలిస్తున్న రూ.74,07,791లను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. సీఎంఎస్ వాహనంలో తరలిస్తున్న. రూ.34 లక్షలను కొత్తూరు పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఎస్ఓటీ శంషాబాద్ టీమ్ సీజ్ చేశారు. ఎస్ ఓటీ మాదాపూర్ టీమ్ రైటర్ సేఫ్ గార్డ్ వాహనంలో తరలిస్తున్న రూ. 21,74,520 నగదును మాదాపూర్ పోలీసులు సీజ్ చేశారు.
మరో ఘటనలో మాదాపూర్ ఎస్ ఓటీ టీమ్ రైటర్ సేఫ్ గార్డ్ వాహనంలో రూ.19,26,405 చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సీజ్ చేశారు. అలాగే ఎస్ ఓటీ రాజేంద్రనగర్ టీమ్ రైటర్ సేఫ్ గార్డ్ వాహనంలో తరలిస్తున్న రూ. 15,49,848 నగదును రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. రూ. 11,63,560 నగదును నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సీజ్ చేశారు.
మరోవైపు బాలానగర్ (Balanagar) టీమ్ రేడియంట్ వాహనంలో తరలిస్తున్న రూ. 5,48,200 నగదును కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. మాదాపూర్ టీమ్ మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ కమిషనరేట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.