నగరంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందనడానికి తరచుగా పట్టుబడుతున్న మత్తు పదార్థాలు నిదర్శనంగా పేర్కొనవచ్చు.. ఇప్పటికే అధికారులు డేగ కళ్ళతో నిఘా నిర్వహిస్తున్నా.. ఈ దందా మాత్రం ఆగడం లేదు.. కొత్త కొత్త మార్గాలలో కేటుగాళ్లు సరాఫరా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లో మరోసారి మత్తు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది.
రాజేంద్రనగర్ (Rajendranagar)లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) వద్ద 15 గ్రాముల మాదక ద్రవ్యాలను మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ సీజ్ చేశారు. వీటిని కారులో తరలిస్తుండగా పసిగట్టి పట్టుకొన్నారు.. అనంతరం నిందితుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే ఈ సమయంలో నిందితుడు పాత నేరస్థుడుగా గుర్తించారు. దీంతో.. అతన్ని అదుపులోకి తీసుకొన్న ఎస్ఓటీ బృందం.. (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
మరోవైపు నిందితుడు రాజేంద్రనగర్ సన్ సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జయ్ చంద్గా గుర్తించారు. కాగా ప్రధాన నిందితుడు సోహాన్ అలియాస్ శ్రీధర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇతను బెంగుళూరు (Bangalore)కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జయ్ చంద్ బెంగుళూరులో కొన్ని రోజులుగా సోహాన్, వివేక్ అనే వ్యక్తుల వద్ద మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడని తెలిపారు.
ఇతను 20 గ్రాముల MDMA మత్తు పదార్థాలను కొనుగోలు చేసి వాటిలో 5 గ్రాములు విద్యార్థులకు విక్రయించారని వెల్లడించారు. ఈ క్రమంలో.. ప్రధాన నిందితుడు సోహాన్ తో పాటు వివేక్ అనే స్మగ్లర్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు నగరంలో మత్తు పదార్థాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కొందరు ఈ దందాకు తెరలేపుతున్నారు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు