మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్ (hyderabad)లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ (NIA) తనిఖీలు చేపట్టింది. హిమాయత్‌నగర్ (Himayatnagar)లోని వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ నివాసంలో సుమారు ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించింది. అటు ఎల్బీనగర్ (LB Nagar)లోని రవి శర్మ, అనురాధ దంపతుల ఇంట్లోనూ దాడులు చేసింది.
ఈరోజు తెల్లవారుజామన 4 గంటల నుంచే విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. సుమారు 5 గంటల పాటు ఆయన ఇంట్లో దాడులు కొనసాగాయి. మరోవైపు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ వద్ద దొరికిన సమాచారం మేరకు వేణుగోపాల్ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టిందని సమాచారం.
ఆయన సెల్‌ఫోన్‌ను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అటు ఎల్బీనగర్‌లోని రవి శర్మ, అనురాధ దంపతుల ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించింది. రవిశర్మ సెల్‌ఫోన్‌తో పాటు బుక్‌లెట్, కరపత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. గతంలో హైదరాబాద్ లో అమరవీరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవాని ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేసిందన విషయం తెలిసిందే..
అలాగే విద్యానగర్ లో సురేష్ ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. పౌర హక్కుల ఉద్యమాలలో ఉన్నవారు, మావోయిస్టులకు అనుబంధంగా పనిచేసేవారు తదితరులను గుర్తించే పనిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది.. తెలంగాణ (Telangana)లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఐఏ దాడులు కొనసాగటం ఇదే మొదటిసారి.