ఇప్పటి వరకు అనేక మోసాలు చూసి ఉంటాం.. అయితే, ప్రభుత్వ సంస్థలను మోసం చేసిన ఘటనలు అరుదుగా చోటుచేసుకుంటాయి. అలాంటి ఘటనే తాజాగా వెలుగుచూసింది. ఓ కంపెనీ యజమాని ఏకంగా ఈపీఎఫ్(EPF)కే టోకరా పెట్టేశాడు.
కొవిడ్-19(Covid-19) కారణంగా సమస్యలు ఎదుర్కొన్న సంస్థల ప్రయోజనాల కోసం 2020 అక్టోబర్లో ఈపీఎఫ్ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) పథకాన్ని ప్రారంభించింది. రూ.15వేలకు తక్కువ సంపాదన ఉండి ఎక్కడా పనిచేయని వారు సైతం పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
అదేవిధంగా వ్యక్తిగతంగా డబ్బులు జమ చేసుకుంటే ప్రభుత్వ సహకారంతో పాటు సబ్సిడీ రూపంలో అవసరమైనప్పుడు డబ్బులు తిరిగి ఇస్తారు. మార్చి 2022 వరకు ఈ పథకం కొనసాగింది. అయితే, ఈ పథకాన్ని అడ్డు పెట్టుకుని ఆ కంపెనీ యజమాని రూ.లక్షలు కాజేశాడు. ఈ పథకంలో హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ ఎస్కే ఇంజనీర్స్, బీ18, మధురానగర్ పేరిట ఏబీఆర్వై పథకం కింద రిజిస్టర్ అయిన కంపెనీ రెండేళ్ల పాటు ఈపీఎఫ్ నుంచి లబ్ధి పొందింది.
ఉద్యోగులు ఉన్నట్లు ఏబీఆర్వై పథకం కింద ఈపీఎఫ్ ఖాతాలు సృష్టించి పలు దఫాలుగా రూ.29.81లక్షలు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ కార్యాలయం నుంచి ఈపీఎఫ్ కార్యాలయానికి సమాచారం వచ్చింది. యజమాని ప్రదీప్కుమార్కు ఫోన్ చేయగా, స్పందన రాలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్బులు కాజేసిన వ్యక్తిపై మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఈపీఎఫ్ ప్రతినిధి ఫిర్యాదు చేశారు.