కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు.. నేడు తుక్కుగూడ (Tukkuguda)లో జనజాతర పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ (BJP).. బీఆర్ఎస్ (BRS) టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ను ఓడించాం.. దేశంలో ఏ టీమ్ బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) సైతం కేంద్రం పై విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మోడీ (Modi) దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. నేడు రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur)లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు..
లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీలో చేరాల్సిందిగా విపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలను పెంచి పోషించే ఏ అవకాశాన్ని కేంద్ర సర్కారు విడిచిపెట్టలేదని ఎద్దేవా చేశారు.. కాగా ఈ సభలో సోనియాగాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), ప్రియాంక గాంధీ సహా ముఖ్య నేతలంతా కలిసి పార్టీ మేనిఫెస్టో న్యాయ్ పత్ర (Nyay Patra)ను విడుదల చేశారు.