బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నన్ని రోజులు సంతోష్ రావు (Santosh Rao) అనే పేరు ప్రముఖంగా వినిపించేది.. కేసీఆర్ (KCR)ను కలవాలంటే ముందుగా సంతోష్ రావును ప్రసన్నం చేసుకోవాలనే టాక్ వినిపించేది. ఒక రకంగా కుటుంబ సభ్యులను సైతం గులాబీ బాస్ కు దూరం చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి.. ఊహించని విధంగా ఆ పార్టీని బలహీనంగా మార్చిందని చర్చలు జరుగుతున్నాయి..
అయితే లోక్ సభ ఎన్నికల్లో కారు స్పీడ్ తగ్గలేదని నిరూపించుకొందామని అనుకొన్న అధిష్టానానికి లిక్కర్ స్కామ్ చిక్కులు తెచ్చింది. గత రెండు సంవత్సరాలుగా నానుతున్న ఢిల్లీ మద్యం కేసు కవిత (Kavitha) అరెస్ట్ తో కొత్త మలుపు తీసుకొంది. అసలే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరోవైపు ఎంపీ అభ్యర్థుల విషయం బీఆర్ఎస్ కు పెద్ద టాస్క్ లా మారింది.
ఇదే సమయంలో తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదవడం ఆ పార్టీని ఇరుకున పడేసిందని అంటున్నారు.. రోడ్ నెంబర్ 14లో ఉన్న ల్యాండ్ కబ్జాకు సంతోష్ రావు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad), బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్ల సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు బాధితులు ఆరోపణలు చేస్తున్నారు..
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో NECL కంపెనీ కి చెందిన భూమిలో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టారని సదరు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో సంతోష్ రావు తో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై 420,468,471,447,120,r/w 34 IPC కింద కేస్ నమోదు చేసినట్టు సమాచారం.