India : కేంద్రంలో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ‘ఇండియా’ విపక్ష కూటమి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబైలో జరగనుంది. ఈ కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో కూటమి పార్టీలన్నీ కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నాయని ఆయన చెప్పారు. డీఎంకే తరఫున తానూ ఇందులో పాల్గొనబోతున్నానన్నారు.
కాగా ఇండియా కూటమి మొదటిసారి సమావేశం గత జూన్ 23 న పాట్నాలో జరిగింది. నాటి ఆ సమావేశానికి కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయు, టీఎంసీ సహా మొత్తం 16 పార్టీలు హాజరయ్యాయి. ఆ తరువాత జులై 17, 18 తేదీల్లో బెంగళూరులో రెండో భేటీ జరిగింది. ఆ సమావేశాలకు 26 పార్టీలు హాజరు కావడం విశేషం.
అంటే కేవలం నెల రోజుల్లోనే కూటమి పార్టీల సంఖ్య మరో పదికి పెరిగింది. దీంతో తమ కూటమికి ‘ఇండియా’ గా ఇవి నామకరణం చేశాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేని ఓడించడానికి ఈ విపక్షాలు వరుసగా సమావేశాలు జరుపుతున్నాయి.
ముంబైలో త్వరలో జరగనున్న సమావేశాల్లో.. ఇదివరకటి భేటీలో చర్చించని అంశాలను కూడా చర్చిస్తారని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా విజయానికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహంపై ఇవి కసరత్తు చేస్తున్నాయి.