కాంగ్రెస్(Congress) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు బీజేపీ హామీల గురించి ఆలోచించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి 20 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి.. నువ్వేం కేంద్ర మంత్రివి అని జగ్గారెడ్డి విమర్శించారు. మన ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదామా అని ఆయన ఎద్దేవ చేశారు.
కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అయ్యాడని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అదేవిధంగా కేసీఆర్‌ను బండి సంజయ్ తిడుతున్నాడని, కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడని ఆయన ఆరోపించారు. నీ కుర్చీనే నువ్వు కాపాడుకోలేక పోయావు.. కాంగ్రెస్ మీద విమర్శలు ఎందుకు బండి సంజయ్ అంటూ.. జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
ఉచిత బస్సు ప్రయాణం నిజం కాదా..? కండ్లకు కనిపించడం లేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నీ పార్టీ సంసారమే సక్కగా లేదు.. మా ఇంచార్జీల గురించి ఎందుకు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంచార్జీల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు. ముందు నీ పార్టీ మీద ఉన్న బురద కడుక్కో కిషన్ రెడ్డి అంటూ… ఆయన మండిపడ్డారు.