ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ(Actress, Ex MLA Jayasudha) బీజేపీ(BJP)కి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Central Minister Kishan Reddy)కి తన రాజీనామా లేఖను పంపారు. జయసుధ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించిన జయసుధకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్న ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జయసుధ మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధినేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆహ్వానం మేరకు జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జయసుధ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగగా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ గెలవలేకపోయారు.
జయసుధ 2016లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీలో ఎక్కువ రోజులు యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంతగూడు కాంగ్రెస్‌లో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం.