రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ.. ప్రత్యర్థి పార్టీలను ఎండగడుతూ.. విమర్శలు గుప్పిస్తోంది. లోక సభ ఎన్నికల్లో విషయమే లక్ష్యంగా సమర శంఖారావం పూరిస్తూ.. పార్టీ ముఖ్య నేతలు సభలు, సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు.. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలపై విరుచుకు పడ్డారు..
బీఆర్ఎస్ హయాంలో అవినీతి చూశాం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసమర్థ పాలన చూస్తున్నామని విమర్శించారు.. కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న జేపీ నడ్డా (JP Nadda).. ప్రధాని మోడీ మన దేశ ఆర్థిక వ్యవస్థను 11 స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చారని తెలిపారు.. మనదేశం మరో రెండేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని వెల్లడించారు.
పదేళ్లుగా తెలంగాణకు కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తున్న విషయాన్ని దాచి.. బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. ఇక రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగిందని, సికింద్రాబాద్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించామని పేర్కొన్నారు. మనదేశంలో తయారైన ఔషధాలు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయని వివరించిన జేపీ నడ్డా.. ఒకప్పుడు ఫోన్లన్నీ మేడిన్ చైనా, కొరియా, జపాన్ వంటి పేర్లతో ఉండేవన్నారు..
మోడీ (Modi) అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మేకిన్ ఇండియా పేరుతో ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తున్నామని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వం హయాంలో ఎన్నో అభివృద్ధి పథకాలకు శ్రీకారం జరిగిందని తెలిపిన నడ్డా.. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను నిజం చేసిన ఘనత మోడీకి చెందుతోందని అన్నారు.. అలాగే తమ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలహీనమైనదని కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతి చేశారని విమర్శించారు. దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ (BJP) అని తెలిపిన నడ్డా.. మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ ఎంపీ అభ్యర్థులైన సీతారాం నాయక్, వినోద్‌రావును గెలిపించి ఢిల్లీకి పంపాలని ప్రజలను కోరారు..