తెలంగాణ (Telangana) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కాలి తుంటి ఎముకకు సర్జరీ జరగడం వల్ల ఇప్పటి వరకూ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కాలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటం వల్ల అందులో పార్టీలో అయోమయ పరిస్థితులు చోటు చేసుకొంటున్నాయనే సమాచారంతో ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న ఆయన నేతలతో ముఖ్య సమావేశాలు నిర్వహించే పనిలోపడ్డారు..
మరోవైపు టీఆర్ఎస్ (TRS) పేరును బీఆర్ఎస్ (BRS)గా మార్చిన తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని కేసీఆర్ భావించారు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీకి పరిమితమవుతారనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఇతర రాష్ట్రాలపై సైతం ఫోకస్ చేసినట్టు టాక్ వచ్చింది. ఇందులో భాగంగా మహారాష్ట్ర నుంచి పార్టీ జయకేతనం ఎగురవేసి, ఢిల్లీలో గులాబీ జెండా రెప రెపలాడేలా చూడాలని భావించారు.
కాని ఊహించని విధంగా తెలంగాణలో ఓటమి తర్వాత పూర్తి నిరాశలోకి వెళ్లినట్లు వార్తలు వ్యాపించాయి. కేసీఆర్ ఇప్పట్లో రాజకీయంగా యాక్టివ్ కాకపోవచ్చన్న ప్రచారం కూడా జరిగింది. వీటన్నింటినీ బ్రేక్ చేస్తూ.. తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ కీలక నేతలు, పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం..
అదే విధంగా కేడర్ పరిస్థితి, క్షేత్రస్థాయిలో బీఆర్ ఎస్ పార్టీ అనుకూల.. ప్రతికూల పరిస్థితులపై సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కేవలం తెలంగాణకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే 16 పార్లమెంటు స్థానాల్లో కనీసం 12 నుంచి 15 స్థానాల్లో విజయం దక్కించుకునేలా వ్యూహాలు ఉండాలని నేతలతో వెల్లడించినట్లు సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) తమ బలాన్ని పెంచుకోగా.. ఓటమి వల్ల వెనుకబడిన బీఆర్ఎస్.. సొంత ఇలాకాలో పరువు కాపాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అతిగా ఆశపడితే అసెంబ్లీ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో గులాబీ బాస్ ప్రస్తుతం తెలంగాణకే పరిమితం కావాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.