రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలంట్ అయిన కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ వ్యూహాల అమలుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కొలుకొంటున్న ఆయన.. సెంటిమెంట్ ను నమ్ముకొని కరీంనగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి దిగనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో మకాం వేయనున్నట్టు సమాచారం.
ఉత్తర తెలంగాణ (Telangana) భవన్ తీగలగుంటపల్లి (Thigalaguntapalli)లో ఉంది. ఈ భవన్ నుంచే అప్పట్లో ఉద్యమం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ జిల్లా నుంచే కేసీఆర్ (KCR) అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన పట్టును.. పార్లమెంట్ ఎన్నికల ద్వారా నిలుపుకోవాలని భావిస్తున్న గులాబీ బాస్.. ఇందుకోసం కరీంనగర్ (Karimnagar) జిల్లా ఎన్నుకొన్నారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారం నుంచి తన ప్రణాళికలను అమలుచేయడానికి సిద్దం అవుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భవం నుంచి బీఆర్ఎస్ (BRS) వరకు కేసీఆర్ను కరీంనగర్ జిల్లా ప్రజలు ఆదరించారు. ప్రతి ఎన్నికల్లో కారు గుర్తుకు పట్టం కట్టారు. అంతేకాదు కరీంనగర్ అంటే కేసీఆర్ కు సెంటిమెంట్ ఉండటం వల్ల ఆమరణ నిరాహార దీక్ష, ఇతర కార్యక్రమాలు సైతం ఇక్కడి నుంచే ప్రారంభించారు.
ప్రస్తుతం త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలను ఇక్కడి నుంచే ప్రారంభించనున్న కేసీఆర్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు తీగలగుంటపల్లిలోనే ఉంటారని తెలుస్తోంది. అందుకోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం కరీంనగర్, నిజమాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత ఓటింగ్ శాతం పెంచుకొంటే బీఆర్ఎస్ గెలుస్తుందనే ధీమా నేతల్లో ఉంది. అందుకే కేసీఆర్ రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.