రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు హడావుడి చేసి చేయనట్టు ఉన్న బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో దూకుడుగా వ్యవహరిస్తోందని అంటున్నారు.. ఈ క్రమంలో లోక సభ ఎన్నికల వ్యూహంలో భాగంగా నేతలు ఒక్కొక్కరుగా ప్రెస్ మీట్లు పెట్టి వార్తల్లో నిలుస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ (Telangana)లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా ఓట్లు మాత్రం పెరిగాయని కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నామని తెలిపిన కిషన్‌రెడ్డి.. ఈసారి డబుల్ డిజిట్‌తో మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోడీ (Modi) ప్రధాన మంత్రిగా మూడో సారి హ్యట్రిక్ సాధించడం ఖాయమని అన్నారు.
దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ అధికారం సాధించిన విషయాన్ని గుర్తు చేసిన కిషన్‌రెడ్డి.. ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా కాంగ్రెస్ అభివర్ణించి రెచ్చగొట్టే ప్రయాత్నాలు చేసిందని మండిపడ్డారు. దేశం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో అభివృద్ధి చెందుతోందని ప్రజలు నమ్మినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసిన బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు..
జిల్లాల వారీగా పార్లమెంటు ఎన్నికలపై సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన కిషన్ రెడ్డి.. నేడు రంగారెడ్డిలో సమీక్షలు జరిపినట్టు తెలిపారు.. బుధవారం హైదరాబాద్ పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరిలో మండల కమిటీల పటిష్టానికి ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. మరోవైపు హైదరాబాద్ (Hyderabad)లో జరిగే విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా, జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ పాల్గొంటారని కిషన్ రెడ్డి వివరించారు..