కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎన్ని ప్రయత్నాలు చేసినా లోక్‌సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయాన్ని ఆపలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
రాజకీయంగా ఈటల అనేక ఉద్యమాలు చేశారని.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆయన ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారనే నమ్మకం తనకుందన్నారు. మల్కాజిగిరిలో ఈటలను గెలిపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
నామినేషన్ వేసిన తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని అధిష్ఠానం సూచించిందని తెలిపారు. కేడర్ అంతా ప్రచారంలో పాల్గొనాలన్నారు. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశామో, ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరించాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఊహించని రీతిలో అత్యధిక మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాము ఎవరికీ బీ టీం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో 12కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కీలకమని అక్కడ పార్టీ అభ్యర్థి వంశ తిలక్‌ను గెలిపించాలని కోరారు.