తెలంగాణ (Telangana) ఉద్యమంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని.. కానీ బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చాక కేసీఆర్ (KCR) విలువలకు తిలోదకాలిచ్చి పాలన చేశారని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని పేర్కొన్నారు. ఈ రాజ్యాంగం పనికి రాదని, కొత్త రాజ్యాంగం రాసుకోవాలని కొందరు అనుకోవడం వారి వంకరబుద్ధికి నిదర్శనమని అన్నారు.
నేడు జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న కోదండరాం (Kodandaram).. రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.. ముఖ్యమంత్రి తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పని చేశామో అదే విధంగా ఇప్పుడు కూడా పని చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఆశించిన మార్పుల కోసం కృషి చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడిందని తెలిపారు.
కొందరు పదవులు అంటే రాచారికపు వైభోగాలుగా భావిస్తారని.. కానీ నిజమైన ప్రజా సేవకులు మాత్రం తమ సొంతానికి అధికారం ఉపయోగించుకోరని అన్నారు.. తెలంగాణ జన సమితి నాయకులు చేసిన సేవకు ఫలితంగానే ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిందని కోదండరాం తెలిపారు. ఏ విలువల కోసం పోరాటం చేశామో అవి రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఎవరుపడితే వారు మార్చడానికి విలులేదన్న విషయం తెలియకుండా మాట్లాడటం ఆవివేకమని పేర్కొన్నారు.
ఇదివరకు చాలా మంది రాజ్యాంగం మార్చాలని అనొచ్చు.. కేసీఆర్ సైతం రాజ్యాంగం మార్చాలని అన్నారు. అదే జరిగితే చైనా, సింగపూర్లో ఉన్న నియంతృత్వ పాలన మనదేశంలో కూడా ఉండేదన్నారు. సమాజ మార్పు దానంతట అదే జరుగదన్నారు.. గద్దర్ చనిపోయే ముందు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఆచరణలోకి వస్తే పూర్తి సమానత్వం వచ్చినట్లని పేర్కొన్న విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు.