ఏపీ రాజకీయాల్లో(AP Politics) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ(YCP)లో మార్పులు, చేర్పుల నేపథ్యంలో పలువురు కీలక నేతలు సైతం పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి(Ex Minister) కొణతాల రామకృష్ణ(Konathala Ramakrishna) అదేబాట పట్టారు. ఆయన త్వరలోనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ కానున్నట్లు ప్రచారం సాగుతోంది.
మాజీమంత్రి రామకృష్ణ అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకుని జనసేనలో చేరికపై కొణతాల క్లారిటీ ఇస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల అనుకుంటున్నారట. అందుకు అనుగుణంగా తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.
కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ హయాంలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి విశాఖజిల్లాలో గరవ సామాజిక వర్గం ప్రతినిధిగా చెలామణి అయ్యారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవంలో పదేళ్లు పదవుల్లో ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందడం అప్పట్లో సంచలనంగా మారింది.
2009లో ఆయన ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ కొంత కాలం ఆయన రాజకీయాల్లోనే కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం ఉండేది. 2014లో పార్టీ ఓడిపోవడం, విశాఖ ఎంపీ సీటులో ఎదురైన వైఫల్యాలు కొణతాలకు అధినాయకత్వంతో దూరం పెంచినట్లు రాజకీయ ప్రచారం. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉన్నారు.
ఇక, గత ఎన్నికల ముందు టీడీపీ ఆహ్వానం మేరకు చంద్రబాబును కలిశారు. దీంతో మరోసారి ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయం అనే ప్రచారం జరిగినా అది సాధ్యపడలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు కొణతాల జనసేన నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల బరిలోకి దిగే ఛాన్స్ ఇస్తే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.