తెలంగాణ (Telangana) మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahender Reddy)ని టీఎస్పీఎస్సీ (TSPSC) చైర్మన్‌గా.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం నియమించడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలున్న వారిని ఎంత మందిని తప్పించారని ప్రశ్నించారు.. లిక్కర్ స్కామ్ లో పట్టుబడ్డ మీరు మీ పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదని కొండా సురేఖ విరుచుకు పడ్డారు.. కవిత (Kavitha) మాటలు చూస్తుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్లందన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు పాలనలో జరిగినంత అవినీతి.. ఎప్పుడు జరగలేదని ఆరోపించారు.. ఇన్నాళ్ళూ అధికారాన్ని అనుభవించి.. అది కోల్పోగానే.. రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
అవినీతిని పెంచి పోషించింది కేసీఆరే అని కొండా సురేఖ (Konda Surekha) ఆరోపించారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే, మీరు డీజీపీగా ఎందుకు పెట్టారు.. అప్పుడే విచారణ చేపట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు.. టీఆర్ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారన్న విషయం మరచిపోకండని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా.. లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా అని ప్రశ్నించారు.
నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని తెలిపిన కొండా సురేఖ.. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని కవితపై మండిపడ్డారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావో మాకు తెలుసని.. లెక్కలు తీస్తే ముఖం ఎక్కడ దాచుకొంటావని ఎద్దేవా చేశారు.. మాట్లాడే సమయంలో వెనుక ముందు చూసుకో అని సూచించారు.. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. మీ అవినీతి భాగోతం తెలిసి చీదరించుకొన్న ప్రజలు మీ పార్టీని బొందపెట్టే సమయం దగ్గరలో ఉందని మండిపడ్డారు..