ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజు సమయం మిగిలి ఉందనగా బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడానికి మంచి స్టఫ్ ఉన్న మ్యాటర్ దొరికిందని అనుకుంటున్నారు.. అనుకూల పరిస్థితులను కూడా ప్రతికూలంగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరితేరిన మొనగాళ్ళు అనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఇక ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు అనే ఫిర్యాదుతో రైతుబంధు పథకం ఆగిన విషయం తెలిసిందే..
అయితే ఈ అంశాన్నిబీఆర్ఎస్ అస్త్రంగా మలచుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్‌లో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ (KTR) రైతుబంధు ఆగిపోవడం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి రాకముందే రైతుబంధు (Rythu Bandhu)ను ఆపిందని ఆరోపించారు.. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొత్తం ఆ పథకానికి శుభం కార్డు వేస్తారని కేటీఆర్ విమర్శించారు..
కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించిన కేటీఆర్.. కాంగ్రెస్‌కు అధికారంలోకి వస్తే కరెంట్, రైతుబంధు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతును నొక్కాలని చూస్తున్నట్టు ఆరోపించిన కేటీఆర్.. అభివృద్ది చేస్తున్న నేతలను గమనించి అధికారం కట్టబెట్టాలని సూచించారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.
మరోవైపు నవంబర్ 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించిందని భావించిన ఈసీ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈసీ నిర్ణయంతో రైతుబంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు తీవ్ర నిరాశ మిగిలింది.