Telugu News » Telangana : బీఆర్ఎస్ ను తుడిచిపెట్టేదెవరు?

Telangana : బీఆర్ఎస్ ను తుడిచిపెట్టేదెవరు?

ఇది ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ మనుగడ కష్టమవుతుంది. ఇది గమనించిన కేటీఆర్.. అంతా బీజేపీ, కాంగ్రెస్ కుట్రగా చెబుతూ.. తామేం తప్పులు చేయలేదు.. తమపై ప్రజా వ్యతిరేకత లేదు అంటూ అంతా వాటి మీదే తోసేసే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.

by admin

– బీఆర్ఎస్ పై కుట్రలు జరుగుతున్నాయంటున్న కేటీఆర్
– బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయని విమర్శలు
– గులాబీ పార్టీని తుడిచిపెట్టేందుకు చూస్తున్నారని ఆరోపణలు
– అసలు, కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థం ఉందా..?
– బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి తప్పులూ జరగలేదా?
– ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా?
– లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి కోసం సింపథీ క్రియేట్ చేస్తున్నారా?

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మాటల యుద్ధానికి దిగారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)ఒక్కటేనని ఏ మంత్రం జపించారో.. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలను పదేపదే వినిపిస్తున్నారు. ప్రధాని మోడీ (PM Modi) ని సీఎం రేవంత్ (CM Revanth) కలవడం, అదానీ గ్రూప్ తో చర్చల అంశాలను పట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ ఒకటికొకటి తోడుగా ముందుకు వెళ్తున్నాయని.. బీఆర్ఎస్ ను తుడిచిపెట్టేందుకు చూస్తున్నాయని.. ఢిల్లీ కేంద్రంగా స్కెచ్ గీశాయని విమర్శల దాడి చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు విన్నాక రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే.. ఎక్కువశాతం గులాబీ తప్పిదాలే రీసౌండ్ ఇస్తున్నాయి.

ktr reminded the words of minister komatireddy venkat reddy

కాళేశ్వరం అవినీతి నిజం కాదా?

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం పేరుతో పలు నిర్మాణాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ, కొన్నేళ్లకే లోపాలు బయటపడ్డాయి. ముందుగా వరదల సమయంలో పంప్ హౌస్ లు మునిగిపోయాయి. ఆ సమయంలో ప్రాజెక్టులను సందర్శించేందుకు వెళ్లిన ప్రతీ ఒక్కర్నీ అరెస్ట్ చేసింది ప్రభుత్వం. నియంత పాలనకు ఇదే నిదర్శనం అంటూ ప్రతిపక్షాలు ఈ ఇష్యూను బాగా హైలైట్ చేశాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజీకి బుంగ ఏర్పడడం మరోసారి కాళేశ్వరం లోపాలను గుర్తు చేశాయి. ఆ సమయంలో కేసీఆర్ మౌనం ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. అదీగాక, అంచనాలను విపరీతంగా పెంచేసిన తీరును కాగ్ రిపోర్ట్ బయటపెట్టింది. మరి, ఇవన్నీ బీఆర్ఎస్ ను తుడిచిపెట్టేందుకు కారణం కాలేదని కేటీఆర్ అనుకుంటున్నారా? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది.

ఉద్యోగ కల్పనలో విఫలం కాలేదంటారా?

తెలంగాణలో 2 లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేది పలు నివేదికలు చెప్పాయి. కానీ, కేసీఆర్ వాటి భర్తీ విషయంలో నిర్లక్ష్యం వహించారు. సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఉద్యోగాలపై కీలక ప్రకటనలు చేశారు. కొన్నింటికి నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. తొమ్మిదిన్నరేళ్లలో ఉద్యోగాలపై ఫోకస్ పెట్టకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమ చావులకు కేసీఆరే కారణం అంటూ ఎంతోమంది సూసైడ్ నోట్స్ కూడా రాశారు. ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాల భర్తీ చేశారా? అంటే అదీలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో నిరుద్యోగుల ఆశల అడియాశలయ్యాయి. ఇది ప్రభుత్వ కుట్రేనని ప్రతిపక్షాలు గట్టిగా వాదించాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు దూరం అయ్యింది బీఆర్ఎస్.

గులాబీల కబ్జాలు, అవినీతి సంగతేంటి..?

భూముల రిజిస్ట్రేషన్స్, ఇతర సమస్యల పరిష్కారం కోసం ధరణి తెచ్చామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇది వచ్చాకే సమస్యలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు బలంగా వినిపించాయి. పైగా, బీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా భూముల కబ్జాలకు పాల్పడ్డారు. అంతేకాదు, ఎంతోమంది అవినీతికి పాల్పడ్డారు. ఒకప్పుడు, సైకిళ్లు, స్కూటర్ల మీద తిరిగిన నేతలు ఇప్పుడు బెంజ్ కార్లలో చక్కర్లు కొడుతున్నారు. అదీగాక, సంక్షేమ పథకాల విషయంలో జరిగిన అవినీతి, కొందరికే జరిగిన లబ్ధిని గమనించి ప్రజలు బీఆర్ఎస్ ను వద్దనుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి, ఇవన్నీ నిజం కాదని కేటీఆర్ చెప్పదలుచుకున్నారా? కేవలం బీజేపీ, కాంగ్రెస్ కలిసి తమపై కుట్రలు చేశాయి.. ఇంకా చేస్తూనే ఉన్నాయని పదేపదే చెప్తుండడం హాస్యాస్పదంగా అనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా జనానికి మంచి చేసి ఉంటే గెలిపించే వాళ్లు కదా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల కోసమేనా?

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆ వెంటనే కేసీఆర్ కు గాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశను పెంచాయి. కేటీఆర్, హరీష్ కాస్త హడావుడి చేస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. కేసీఆర్ రంగంలోకి ఎప్పుడు దిగుతారా? అని ఎదురుచూస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో నిరాశ ఎక్కువ కాకుండా త్వరలో పులి వస్తుందని కేటీఆర్ అంటున్నారు. ఇంకొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. జాతీయ అంశాలే ప్రధాన అజెండాగా ఉండే ఈ ఎన్నికల్లో ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఓట్ షేర్ పెంచుకున్న బీజేపీ మధ్యే ఫైట్ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ మనుగడ కష్టమవుతుంది. ఇది గమనించిన కేటీఆర్.. అంతా బీజేపీ, కాంగ్రెస్ కుట్రగా చెబుతూ.. తామేం తప్పులు చేయలేదు.. తమపై ప్రజా వ్యతిరేకత లేదు అంటూ అంతా వాటి మీదే తోసేసే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.

You may also like

Leave a Comment