కాంగ్రెస్ (Congress) పార్లమెంట్ ఎన్నికల పేరుతో హామీల అమలును వాయిదా వేయాలని చూస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR).. కరీంనగర్ (Karimnagar)లో బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్పొరేటర్లతో జరిగిన భేటీలో కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో.. రాజకీయ వర్గాలలో.. అంతెందుకు సొంత పార్టీలోనే కేటీఆర్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే..
అయినా ఏమాత్రం తగ్గేదే లే అంటూ వ్యవహరించడం చర్చాంశనీయంగా మారింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన.. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తోందని దీమా వ్యక్తం చేసిన కేటీఆర్.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ (KCR)పై ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం పెద్ద విషయం కాదన్నట్లుగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ కు 39 సీట్లు రావడం చిన్న విషయం కాదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలన్ని అమలు చేయక పోతే కాంగ్రెస్ నేతలను బట్టలు విప్పి నడిరోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. ఎంపీ ఎన్నికలకు ముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారాయి.