Telugu News » KTR : కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది!

KTR : కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది!

ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి మూడో వంతు సీట్లు వచ్చాయని.. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్లతోనే జరిగిందన్నారు. మొత్తంగా కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా కేవలం 1.85 శాతం మాత్రమేనని వివరించారు.

by admin
KTR Participated In The Preparatory Meeting Of Mahabubabad Lok Sabha Constituency

– పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళం
– దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మనమే
– ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వమే
– 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచాం
– కానీ, ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యాం
– అందుకే, కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది
– మహబూబాబాద్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును పార్లమెంట్ ఎన్నికలతో నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS) తెగ తాపత్రయపడుతోంది. సన్నాహక సమావేశాలు అంటూ హడావుడి చేస్తోంది. చేసిన తప్పులతోపాటు ఓటమికి గల కారణాలను అన్వేషించుకుంటోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. గురువారం మహబూబాబాద్ (Mahabubabad) పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ (Congress) హామీలపై విమర్శల దాడి చేశారు.

KTR Participated In The Preparatory Meeting Of Mahabubabad Lok Sabha Constituency

ప్రజలు పదేళ్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారని.. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలేదని సెటైర్లు వేశారు. ‘‘నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. 420 హమీలిచ్చారు. వాళ్ళ తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ప్రచారం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నారు, తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది’’ అని వివరించారు.

దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. దీన్ని ఏనాడూ చెప్పుకోలేదన్నారు కేటీఆర్. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది కూడా తామేనని.. ఈ విషయంపై కూడా ప్రచారం చేసుకోలేదని తెలిపారు. దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73శాతం జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడూ చెప్పుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని విమర్శించారు.

పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మనమే గెలిచేవాళ్ళమని బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పారు కేటీఆర్. వందలాది సంక్షేమ కార్యక్రమాలు తమ హయాంలో అమలు చేసినా, ఏనాడూ ప్రజలను లైన్లలో నిలబెట్టలేదని గుర్తు చేశారు. ప్రజల సౌకర్యమే చూసాం కానీ రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఆలోచించలేదన్నారు. ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి మూడో వంతు సీట్లు వచ్చాయని.. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్లతోనే జరిగిందన్నారు. మొత్తంగా కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా కేవలం 1.85 శాతం మాత్రమేనని వివరించారు.

స్దానిక సంస్ధల నుంచి మెదలుకొని అసెంబ్లీదాకా బలమైన నాయకత్వం తమకుందన్నారు కేటీఆర్. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉందని.. అన్నింటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ‘‘ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారు, రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండి రాగానే వెంటనే మాఫీ చేస్తామన్నారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారి లేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలను ఆడుతున్నారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే స్వేదపత్రం రూపొందించాం. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన పార్టీకి బలమైన నాయకులు అద్భుతమైన నాయకత్వం ఉంది’’ అని వివరించారు కేటీఆర్.

పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుందామని.. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని.. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు.. పొడు భూముల పట్టాల పంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను చేపట్టినట్టు వివరించారు. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజల పూర్తి మద్దతు రాలేదని, ఇలాంటి వాటన్నింటినీ విమర్శ చేసుకుని ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ పోచారం, ఎంపీ కవిత, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment