బీజేపీ (BJP)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. శ్రీరాముడు అందరివాడు.. ఆ రాముడితో మనకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా ఆ పార్టీతోనే అని స్పష్టం చేశారు. ఈ పదేండ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తే వాళ్ళు జైశ్రీరాం అనడం నేర్చుకున్నారని తెలిపారు.. నేడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో పాల్గొని మాట్లాడుతూ.. రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదామని పేర్కొన్నారు.
అలాగే పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను బడా వ్యాపారులకు మోడీ (Modi) మాఫీ చేశారు. కానీ రైతులకు సంబంధించి ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు.. కరోనా సమయంలో కూలీలు తమ సొంతూర్లకు వెళ్లేందుకు కనీసం ఫ్రీ రైళ్లు పెట్టలేదని తెలిపిన కేటీఆర్ (KTR).. కేసీఆర్ (KCR) మాత్రం 180 రైళ్లు ఫ్రీగా పెట్టి రూ. 500 ఇచ్చి బీహార్, యూపీకి పంపించారని వెల్లడించారు..
అలాగే పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణపై బీజేపీకి ప్రేమ ఉంటే.. భద్రాచలం టెంపుల్కు ఒక్కరూపాయి అయినా ఇచ్చేవారని అన్నారు. ఘట్కేసర్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్కు కిషన్ రెడ్డి పైసా అయిన ఇచ్చారా అని ప్రశ్నించారు.. మరోవైపు కాంగ్రెస్ పై సైతం విమర్శలు గుప్పించారు.. అసెంబ్లీ ఎన్నికలలో అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
కాంగ్రెస్ (Congress) ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం.. వేటాడుతాం అని కేటీఆర్ హెచ్చరించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) మీటింగ్లో పాల్గొన్న ఆయన.. రాజకీయాల్లో కొన్ని సార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతాం. గెలిచినంత మాత్రానా పొంగిపోవద్దు.. ఓడినంత మాత్రాన కుంగిపోయేది లేదని తెలిపారు..
అలాగే ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. నీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఖర్మ మాకు పట్టలేదని.. ఆటోమేటిక్గా నువ్వే కూల్చేసుకుంటావని అన్నారు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు. ఫోన్ల ట్యాపింగ్స్ మీద పెట్టిన శ్రద్ద వాటర్ ట్యాపింగ్స్ మీద పెట్టు అని తీవ్రంగా విమర్శించారు..
అలాగే చేవెళ్లలో పనికిరాని చెత్తను మల్కాజ్గిరి ముఖం మీద పడేసిండని విమర్శించిన కేటీఆర్.. కాంగ్రెస్ కి ఓటేస్తే ఎంత నష్టం జరిగిందో గమనించండని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి జంప్ అవుతున్నారని ఆరోపణలు చేశారు.