రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla District)లో గురువారం ఆయన పర్యటించారు. తంగళ్లపల్లి మండలం(Thangallapally Mandal) సారంపల్లి(Sarampalli) వద్ద పంట నష్టాన్ని కేటీఆర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత కరువు పరిస్థితులు కాలం తెచ్చింది కాదని.. కాంగ్రెస్ తెచ్చిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతుబంధు కోసం రూ7వేల కోట్లు ఉంచివెళ్తే.. అవి రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్‌లకు ఇస్తోందని ఆరోపించారు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇదే సమయానికి సాగునీరు అందించిందని గుర్తుచేశారు.
కేసీఆర్‌పై కడుపు మంటతో మేడిగడ్డ బ్యారేజీని మరమ్మతులు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నారన్నారు. దయచేసి రైతులు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దంటూ కోరారు.రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్ సర్కార్ ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్నారు.
ఎకరాకు రూ.10వేలు నుంచి రూ.25వేలు వరకు ఎంత ఇస్తారో ఇవ్వండని సూచించారు. ఢిల్లీకి, హైదరాబాద్‌కు తిరగడం తప్ప రైతులను పరామర్శించే సమయం రేవంత్‌రెడ్డి లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతుబంధు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.