Telugu News » KTR Vs Revanth : రేవంత్.. బీజేపీ ముఖ్యమంత్రా? సోషల్ మీడియాలో రచ్చ

KTR Vs Revanth : రేవంత్.. బీజేపీ ముఖ్యమంత్రా? సోషల్ మీడియాలో రచ్చ

క్రిశాంక్, కేటీఆర్ పోస్టులను సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా రంగంలోకి దిగడంతో.. కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు.

by admin
ktr tweet on revanth reddy 1

– రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ ప్రతినిధులు
– మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు
– బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనంటూ ట్వీట్లు
– హస్తం శ్రేణుల కౌంటర్ ఎటాక్
– మోడీ, అదానీతో కేసీఆర్ ఫోటోలతో ట్రోల్

గౌతమ్ అదానీ (Gautam Adani).. భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త. కానీ, ఈయన పేరు వ్యాపారవర్గాల్లో కన్నా దేశ రాజకీయాల్లోనే మార్మోగుతుంటుంది. ప్రధాని మోడీ (PM Modi) ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ (Congress) నేతలు అదానీ చుట్టూ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. దీనికి కమలనాథులు కూడా కౌంటర్ ఇస్తూ ఉంటారు. దేశ సంపదను అదానీకి మోడీ దోచి పెడుతున్నారనేది హస్తం పార్టీ వాదన. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఎంతగానో ద్వేషించే అదానీ గ్రూప్ ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీ కావడం ఇక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

ktr tweet on revanth reddy

రేవంత్ తో అదానీ గ్రూప్ చర్చలు

తెలంగాణలో పెట్టుబడుల విషయంపై మాట్లాడేందుకు రేవంత్ తో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ మేరకు సీఎంతో అదానీ పెద్ద కుమారుడు కరణ్, ఏరో స్పేస్ సీఈవో ఆశీష్ రాజ్ వన్షిలు సెక్రటేరియట్‌ లో చర్చలు జరిపారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వనిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని.. కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు అన్నారు.

ktr tweet on revanth reddy 1

బీజేపీ సీఎం అంటూ కేటీఆర్ సెటైర్లు

ఈ భేటీ రాష్ట్రంలో పెట్టుబడుల అంశమే అయినా.. బీఆర్ఎస్ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేననే సంకేతాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు చూస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ చూస్తే ఇది స్పష్టంగా అర్థం అవుతోంది. ముందుగా బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఓ ట్వీట్ చేశారు. అందులో ప్రధాని మోడీని రేవంత్ కలిసిన ఫోటో.. రేవంత్ తో అదానీ ప్రతినిధులు కలిసిన ఫోటోను జత చేసి ‘మీటింగ్ విత్ ప్రధాని-బిజినెస్ విత్ అదానీ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అలాగే, ‘టీమ్ ఏ – టీమ్ అదానీ’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రా? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు.

ktr tweet on revanth reddy 2

కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ ఎటాక్

క్రిశాంక్, కేటీఆర్ పోస్టులను సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కూడా రంగంలోకి దిగడంతో.. కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఇదేనా మీ సంస్కృతి.. మీ నాయకుడు నేర్పింది ఇదేనా? పెట్టుబడులు తెస్తే ఇలా మాట్లాడతారా..? లేకపోతే మీ ప్రభుత్వంలో కంపెనీలు పారిపోతున్నాయని అంటారా? అంటూ ఫైరవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రిని కలిసి సమస్యల పరిస్కారం కోసం కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే, రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యాపారవేత్తలను కలిస్తే ఇంతలా దిగజారి మాట్లాడతారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే.. మోడీ, అదానీతో కేసీఆర్ దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment