సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) లాస్య నందిత (Lasya Nanditha) ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.. పటాన్ చెరు (Patan Cheru) ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. తాజాగా కీలక ఆధారాలు సేకరించారు.
లాస్య కారును ఢీకొన్న టిప్పర్ను గుర్తించారు. సదరు వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు యాక్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత కర్ణాటక (Karnataka)లో టిప్పర్ను గుర్తించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారించగా.. అతను కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కారు అతి వేగంతో వచ్చి టిప్పర్ ను ఢీకొట్టడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ వెల్లడించినట్లు తెలిపారు.
మొదట కారు టిప్పర్ ను ఢీకొని అనంతరం వేగంగా వెళ్లి రెయిలింగ్ ను ఢీకొట్టిందని డ్రైవర్ వివరించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. మరోవైపు నేటి సాయంత్రం రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించే చాన్స్ ఉందని సమాచారం..
ఇదిలా ఉండగా లాస్య నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత పలుమార్లు ఆమెను మృత్యువు వెంటాడుతూ వచ్చింది. ఒకసారి లిఫ్ట్ లో చిక్కుకొనగా, ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి తప్పించకొన్నారు. కానీ మూడో సారి జరిగిన ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు.. పట్టుదలతో కాపు కాసిన మృత్యువు చివరికి ఆమె ప్రాణాలు బలి తీసుకొంది.