Telugu News » BRS List : బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్.. ఎవరెవరు ఏమన్నారంటే..?

BRS List : బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్.. ఎవరెవరు ఏమన్నారంటే..?

కేసీఆర్ గొంతులో భయం, ఓటమి స్పష్టంగా కనిపించాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఏర్పడిందని చెప్పారు.

by admin
leaders reaction on brs list

సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల లిస్టు ప్రకటించిన నేపథ్యంలో పలువురు నేతలు తమదైన రీతిలో స్పందించారు. తెలంగాణకు ఇది ఉత్సాహకరమైన సమయమని అన్నారు ఎమ్మెల్సీ క‌విత (MLC Kavitha). అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు. కేసీఆర్ ధైర్యవంతమైన నాయకత్వంపై, ప్రభావశీలమైన బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకముందన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌ని చేసే ప్ర‌భుత్వాన్ని గుర్తించి మ‌రోసారి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాల‌ని కోరారు కవిత.

leaders reaction on brs list

కేసీఆర్ గొంతులో భయం, ఓటమి స్పష్టంగా కనిపించాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఏర్పడిందని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మార్పు చేసి కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని.. గజ్వేల్‌ లో ఓడిపోతానని భయంతోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు. ఆయన్ను రెండు స్థానాల్లో ఓడించి తీరుతామని అన్నారు రేవంత్ రెడ్డి.

టెకెట్ల విషయంలో కొందరు నేతలు అలకబూనడంతో మంత్రి కేటీఆర్ (KTR) రంగంలోకి దిగారు. ఎన్నికల్లో పోటీకి హామీ దక్కిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలని హితవు పలికారు. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న కృష్ణ (కంటోన్మెంట్ టికెట్ ఆశించిన నేత), కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరమన్నారు. వారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే భరోసా లభిస్తుంది అని తెలిపారు కేటీఆర్.

కేసీఆర్ కాళ్ల కింద భూమి కదిలిపోతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy). అందుకే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ఎద్దేవ చేశారు. త్వరలోనే బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ అభద్రతాభావంలో ఉన్నారని.. సర్వేలు ఆయనకు అనుకూలంగా లేవని విమర్శించారు. ప్రభుత్వం భూ వ్యాపారం చేస్తోందని.. బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వ్యవహరిస్తోందని అన్నారు కిషన్ రెడ్డి.

గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని కేసీఆర్ బాగా అర్థమైందన్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila). అందుకే, ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పారు. స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం.. కేసీఆర్ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనమని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతమన్నారు. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్రూం ఇళ్లు అక్కడి ప్రజలకు అందలేదని ఆరోపించారు షర్మిల.

కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించడంపై ఎంపీ అరవింద్ (MP Aravind) సెటైర్లు వేశారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుండి కేసీఆర్‌ లో భయం మొదలైందన్నారు. గజ్వేల్‌ లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ చేసేందుకు వస్తున్నారని.. అక్కడ ఓడించి పంపుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని సెటైర్ వేశారు అరవింద్.

You may also like

Leave a Comment