నంద్యాల జిల్లా(Nandyala District) శ్రీశైలం(Srisailam)లో రోజురోజుకి చిరుత పులుల సంచారం పెరిగిపోతోంది. తాజాగా, మరోసారి చిరుతపులి కలకలం సృష్టించింది. రాత్రి వేళలో ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత సంచరిస్తోంది. రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర శనివారం రాత్రి గోడపై చిరుత కూర్చుంది.
దాన్ని చూసిన స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను స్థానికులు, యాత్రికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొద్ది సేపటికి వాహనాలు తిరగటాన్ని గమనించిన చిరుతపులి దగ్గరలోని అడవిలోకి వెళ్లిపోయింది.
మూడు నెలల కిందట ఇక్కడ రుద్రాపార్కు సమీపంలో చిరుత కనిపించింది. అయితే అప్పుడు అటవీశాఖ అధికారుల టపాసులు కాల్చి చప్పుడు చేయడంతో అది తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే రాత్రి మళ్లీ రత్నానందస్వామి ఆశ్రమం వద్ద చిరుత ప్రత్యక్షమైంది. సుమారు గంటపాటు హోమగుండం వద్ద పడుకుని అటూ ఇటూ తిరుతున్న భక్తులను స్థానికులను గమనిస్తూ ఉంది.
చిరుత మరోసారి కనిపించడంతో ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.