ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణ పూర్త అయ్యింది. కాగా విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.. ఇందులో భాగంగా అరుణ్ పిళ్ళై స్టేట్మెంట్ అంశాలను సైతం కోర్టు ముందు ప్రస్తావించారు. అతను తన స్టేట్మెంట్ ఉపసంహరించుకొన్నారని తెలిపారు..
అదీగాక విచారణలో అరుణ్ రామచంద్ర పిళ్ళై తొమ్మిది సార్లు కవిత పేరు చెప్పలేదని పేర్కొన్నారు. మరోవైపు తొమ్మిది స్టేట్మెంట్ లు ఒక రకంగా ఉంటే, పదో రిప్లై పూర్తి విరుద్దంగా ఉందని న్యాయవాది వాదనలు వినిపించారు.. 18 నెలల ముందు దాఖలు చేసిన చార్జ్ షీట్, అదనపు చార్జ్ షీట్ లో నిందితురాలిగా, ముద్దాయిగా కవిత పేరు ఎక్కడా లేదని వివరించారు.. ఆమె అరెస్ట్ అన్యాయమని తెలిపిన అభిషేక్.. సమన్ల కు స్పందించినా, విచారణకు సహకరించినా అరెస్ట్ చేశారని అన్నారు..
అదేవిధంగా సీఆర్పీసీ 160 ప్రకారం… తొలి సమన్లలోనే ఎందుకు అరెస్ట్ చేశారో తెలపాలని అన్నారు.. కవితకు వ్యతిరేకంగా బుచ్చిబాబు స్టేట్మెంట్ ఫస్ట్ లో ఉన్నా.. తర్వాత ఇతర స్టేట్మెంట్ లో విభిన్నత ఉందని అభిషేక్ మను సింఘ్వీ అన్నారు.. బుచ్చిబాబును విచారణకు పిలిచారు కాని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని వాదనలు వినిపించారు.. ఇదిలా ఉండగా వీరి వాదనలు విన్న న్యాయస్థానం.. ఎలాంటి బెయిల్ కావాలని కోరుకుంటున్నారో.. తేల్చుకోవాలని అభిషేక్ సింఘ్వీకి సూచించింది.
అదేవిధంగా విచారణను కోర్టు ఏప్రిల్ 4కు వాయిదా వేయడంతో కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.