అయోధ్యలో ‘రామ్ లల్లా’ (Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ (LK Advani) హాజరు కాలేదు. అయోధ్యలో విపరీతమైన చలి గాలులు వీస్తుండం, ఆయన వయస్సు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో సీనియర్ నేత మురళి మనోహర్ జోషి కూడా హాజరు కాలేదు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అద్వానీ హాజరయ్యే విషయంపై మొదటి నుంచి సందిగ్దత నెలకొంది. మొదట ఎల్ కే అద్వానీ, మురళి మనోహర్ జోషిలను వారి వయస్సు, ఆరోగ్య కారణాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అయోధ్యకు రావొద్దని సూచించామని ఇటీవల శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. తమ విజ్ఞప్తిని సీనియర్ నేతలు అంగీకరించినట్టు చెప్పారు.
దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయోధ్య కల సాకారం కావడంలో అద్వానీ ప్రముఖ పాత్ర పోషించారని, రథ యాత్ర చేపట్టి దేశ రాజకీయాలనే కీలక మలుపు తిప్పిన నేతను ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కార్యక్రమానికి రావాలని ఇరువురు నేతలను మరోసారి ట్రస్టు సభ్యులు కోరారు. ఇద్దరు నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు. కానీ తాజాగా ప్రాణ ప్రతిష్టకు ఇరువురు నేతలు గైర్హాజరవడం గమనార్హం.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాటం చేయాలని 1984లో వీహెచ్పీ నిర్ణయించింది. ఆ తర్వాత 1989లో దేశ వ్యాప్తంగా రామ శిల కార్యక్రమంతో పోరాటం కీలక మలుపు తిరిగింది. దీంతో 1989 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తన మెనిఫెస్టోలో రామ మందిర నిర్మాణం అంశాన్ని పెట్టారు. ఎన్నికల అనంతరం నాలుగు నెలల్లో రామ మందిరాన్ని నిర్మిస్తామని పీవీ మాట ఇచ్చారు. కానీ నిలబెట్టుకోలేకపోయారు. దీంతో వీహెచ్పీ కరసేవ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇది ఇలా వుంటే ప్రాణ ప్రతిష్ట సందర్బంగా 1990లో అద్వానీ రథయాత్ర చేపట్టినప్పుడు అద్వానీకి రథాన్ని తయారు చేసిన ప్రకాశ్ నలవడే అప్పటి క్షణాలను ఒకసారి గుర్తుకు చేసుకున్నారు. 12 సెప్టెంబర్ 1990న రథయాత్ర గురించి ప్రకటన చేశారని వెల్లడించారు. ఆ తర్వాత 25 సెప్టెంబర్ 1990న గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అద్వానీ రథయాత్ర మొదలు పెట్టారు.
అంతకు ముందే బీజేపీ నేత మురళి మనోహర్ జోషి తనను సంప్రదించారని చెప్పారు. అద్వానీ యాత్రకు రథాన్ని చేయాలని కోరడంతో తాను రథాన్ని సిద్దం చేశానన్నారు. యాత్ర అయోధ్యను చేరుకోవడానికి ముందు 23 అక్టోబర్ 1990న బిహార్లో అద్వానీని అరెస్టు చేశారని పేర్కొన్నారు. దీంతో అయోధ్య రామ మందిర ఉద్యమం తారాస్థాయికి చేరుకుందన్నారు. ఆ ఉద్వేగ భరిత క్షణాలను ఎప్పటికీ మరచి పోలేనన్నారు.