దేశంలో లోక్ సభ (Loksabha) సార్వత్రిక ఎన్నికలు (Elections) ఏప్రిల్ 16 నుంచి నిర్వహిస్తారంటూ ఓ వార్త వైరల్ (Viral) అయింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారీ జారీ చేసిన సర్క్యులర్ ఒకటి వైరల్ కావడంతో ఎన్నికల అంశంపై హాట్ చర్చ జరిగింది. అటు రాజకీయ వర్గాలు, ఇటు సామాన్య జనం ఈ అంశం గురించి పెద్ద ఎత్తున చర్చించుకున్నారు. ఇది కాస్త ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో దానిపై క్లారిటీ ఇచ్చింది.
సర్క్యులర్లో వెల్లడించి తేదీల గురించి పలువురు మీడియా ప్రతినిధులు తమను ప్రశ్నిస్తున్నారని ఢిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి వెల్లడించారు. ఎన్నికలను ఓ ప్లానింగ్ ప్రకారం నిర్వహించేందుకు, పోలింగ్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా కేవలం రెఫరెన్స్ కోసం ఆ తేదీని సర్క్యులర్ లో ప్రస్తావించామని వివరణ ఇచ్చారు. ఆ తేదీకి ఎన్నికలకు సంబంధం లేదన్నారు.
ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం పలు కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆ పనులన్నింటినీ గుర్తించాక, ఏదో ఒక రోజును ఎన్నికల తేదీగా ఊహించుకుని దాన్ని రెఫరెన్స్ తేదీగా ఇస్తామన్నారు. ఆ రిఫరెన్స్ తేదీ ఆధారంగా ఆయా పనులను ఏ రోజును ప్రారంభించి వాటిని ఏ తేదీలోగా పూర్తి చేయాలనే దానిపై తాము టార్గెట్ పెట్టుకుంటామని చెప్పారు. ఆ మేరకు ఏప్రిల్ 16ను తమ రెఫరెన్స్ కోసం అధికారులకు సూచించామన్నారు.
ఏప్రిల్ 16 లోపు ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా వర్గాలకు ఈ నెల 19న అధికారికంగా ఓ సర్క్యులర్ జారీ చేశామని వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. సరైన సమయంలో ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తారని స్పష్టం చేశారు.