పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇండియా కూటమి.. బీజేపీ.. మధ్య పోరు ఉత్కంఠంగా సాగుతోంది. ఇప్పటికే ఒకవైపు రాహుల్ అండ్ టీమ్ ప్రచారంలో అదరగొడుతుండగా.. మరోవైపు మోడీ సారథ్యంలో బీజేపీ నేతలు సైతం విమర్శల బుల్లెట్స్ వరుసగా వదులుతున్నారు.. ఈ క్రమంలో ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ.. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్యూలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు..
2024 లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) అనంతరం తాను మళ్లీ అధికారంలో వచ్చాక దేశం కోసం తీసుకొనేందుకు.. నా దగ్గర పెద్ద ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.. అలాగే తన నిర్ణయాలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. తాను తీసుకునే నిర్ణయాలు దేశ సర్వతోముఖాభివృద్ధి కోసమేనని, ఎవరినీ భయపెట్టడానికి కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు..
అలాగే ఈ ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలు సాధిస్తే.. ఆ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఇండియా కూటమి సభ్యులు పదే పదే నిందలు వేస్తున్నట్లు తెలిపిన మోడీ (Modi).. ప్రత్యేక ఆర్టికల్ ప్రకారం ఇది సాధ్యమే అయినప్పటికి బీజేపీ (BJP)కి మాత్రం అలా చేసే ఉద్దేశం లేదని అన్నారు.. అయితే దేశం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపారు..
మరోవైపు బీజేపీ తమ మేనిఫెస్టోలో సీఏఏ (CAA) అమలు, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా 2024 లో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 400 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది.