అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) అపజయం పాలైనప్పటి నుంచి బీఆర్ఎస్ (BRS)లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామాలు చేస్తుండటం గులాబీ ముఖ్యనేతలను కలవరపెడుతుంది. కార్యకర్తలు, కార్పొరేటర్ స్థాయి నుంచి కీలక నేతలు సైతం పక్క పార్టీలోకి వలస వెల్లుతున్న వార్తలు నిత్యం వినిపిస్తున్నాయి.. ఇక లోక సభ ఎన్నికల (Lok Sabha Elections)తర్వాత పార్టీ పరిస్థితి ఏంటీ అనేది చర్చాంశనీయంగా మారింది.
మరోవైపు ఇతర రాష్ట్రాలకు పార్టీ విస్తరణ సంగతి ఎలా ఉన్నా.. ఒడిశా ఇన్చార్జి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ ఇటీవలే రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు సైతం తప్పుకొన్నారు. ఆ రాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్న తోట చంద్రశేఖర్ కూడా కారు దిగి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటికి కొనసాగింపుగా..
మహారాష్ట్ర (Maharashtra)లో బీడ్ జిల్లా కోఆర్డినేటర్‌గా ఉన్న దిలీప్ గ్యానోబా గోరె కూడా బీఆర్ఎస్ కు షాకిచ్చారు. బాధ్యతలతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కేసీఆర్ (KCR)తో పాటు మహారాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఉన్న వంశీరావ్, మహారాష్ట్రలోని పార్టీ నాయకులనూ కలిసే అవకాశం లేకుండా పోయిందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నాయకత్వ లోపమున్న పార్టీలో ఇక ఎంతమాత్రం కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గతేడాది ఏప్రిల్ 20న శంభాజీనగర్‌లో జరిగిన భారీ ర్యాలీ, బహిరంగసభలో తన శక్తి మేరకు దాదాపు 50 వేల మందిని సమీకరించానని గుర్తుచేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తుందని భావించానని.. కానీ మహారాష్ట్ర లీడర్లు కేడర్‌ను డ్రైవ్ చేయడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని, దిశానిర్దేశంలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్లో కొనసాగలేనని స్పష్టం చేశారు.