మాల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో దౌత్యపరమైన వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ(PM Modi) ఇటీవల లక్షద్వీప్ పర్యటించిన సందర్భంగా బీచ్ ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఆ తర్వాత కొందరు మంత్రులు అవమానకరంగా పోస్టులు చేయడంతో నెట్టింట పెనుదుమారమే చెలరేగింది. ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్‌ను రద్దు చేసుకుంటున్నారు.
ఈ పరిణామాల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు(Maldives President) మహ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) చైనా(China) నుంచి ఎక్కువ మంది పర్యాటకులను రప్పించుకునే ప్రయత్నాలను చేస్తున్నారు. చైనాలో తన ఐదు రోజుల అధికారిక పర్యటనలో ముయిజ్జూ ఫుజియాన్ ప్రావిన్స్‌లో ‘మాల్దీవులు బిజినెస్ ఫోరం’లో పాల్గొని చైనాపై ప్రశంసల జల్లు కురిపించడం మొదలుపెట్టారు.
చైనాను తమ మిత్రుడని అభివర్ణిస్తూ.. 2014లో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ప్రారంభించిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ (BRI) ప్రాజెక్టు ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపాలని ఆయన డ్రాగన్ కంట్రీని కోరారు. ఇక, కరోనా కంటే ముందు చైనాకు చెందిన పర్యటకులు అత్యధిక సంఖ్యలో మాల్దీవులను సందర్శించేవారని, తిరిగి మళ్లీ తమ పర్యటనలకు వేగవంతం చేయాలని చైనాను కోరారు.
ఇరుదేశాలు 50 మిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ప్రాజెక్టులపై సంతకం చేశాయి. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ గతంలో విడుదల చేసిన డేటా ప్రకారం.. 2023లో భారతదేశం అతిపెద్ద పర్యాటక మార్కెట్ కాగా, గతేడాది అత్యధికంగా 2 లక్షల 9 వేల 198మంది భారతీయులు పర్యటించారు. రష్యాకు చెందిన పర్యాటకులు 2 లక్షల 9 వేల 146 మంది పర్యటించారు. 1,87,118మంది పర్యాటకులతో చైనా మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది.