మాల్దీవులు(Maldives) పర్యాటకంగా, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారత్(Bharath)కు వ్యతిరేకంగా అక్కడి ముగ్గురు మంత్రుల నోటి దురుసే ఇందుకు కారణం. భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవులుకు తెలిసివస్తోంది. అయితే, ఆ ముగ్గురు మంత్రులపై వేటు పడినా నిరసనల జ్వాల కొనసాగుతూనే ఉంది.
ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ పీఠాలు కదిలే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మాల్దీవులుకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోగా, పర్యాటక ఆదాయం తగ్గుతోందని ఆ దేశనేతలు సతమతమవుతున్నారు. ‘బాయ్‌కాట్ బాల్దీవ్స్’ నినాదం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న వేళ- ఆ దేశం చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు.
ఈ పరిస్థితులపై మాల్దీవుల్లోని అధికార, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ కోరారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సభ్యులకు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలపై మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ మండిపడ్డారు. భారతదేశం మాల్దీవులకు విశ్వాసపాత్రమైన మిత్ర దేశమని ఆయన గుర్తు చేశారు. మాల్దీవులకు భారత్ క్లిష్ట సమయంలో అండగా నిలిచే స్నేహ దేశమని అన్నారు.
మాల్దీవులకు ఆపద వస్తే వెంటనే స్పందించే ఎమర్జెన్సీ కాల్ లాంటి దేశంగా భారత్‌ను మరియా అహ్మద్ దీదీ అభివర్ణించారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై త్వరితగతిన మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్దీవుల పార్లమెంటు సభ్యుడు మికెల్ నసీమ్ డిమాండ్ చేశారు.