మణిపూర్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)కు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో యాత్ర నిర్వహించేందుకు మణిపూర్ (Manipur) ప్రభుత్వం అనుమతిచ్చింది. జనవరి 14న పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో ఈ యాత్రను ప్రారంభించనున్నారు. హప్తా కంగ్ జే భంగ్ మైదానం నుంచి యాత్రను ప్రారంభించేందుకు బీరెన్ సింగ్ సర్కార్ అనుమతులు ఇచ్చింది.
జనవరి 14న రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో యాత్రను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్టు ఇంపాల్ తూర్పు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ యాత్రలో ఎంత మంది పాల్గొంటారు, వాళ్ల పేర్లను ముందుగానే అధికారులకు అందజేయాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
జనవరి 14న మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వాలని ఎనిమిది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఈ రోజు సీఎంతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా యాత్రకు అనుమతులు ఇవ్వలేమని సీఎం బీరెన్ సింగ్ చెప్పారని పీసీసీ చీఫ్ మేఘా చంద్ర వెల్లడించారు.
ఈ క్రమంలో యాత్రపై ఉత్కంఠ నెలకొంది. మణిపూర్ సర్కార్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే షెడ్యూల్ ప్రకారమే రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. యాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. అందువల్ల ఇంఫాల్ లోని మరో ప్రాంతం నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇంతలోనే అనుమతులు రావడంతో యాత్ర యథావిధిగా కొనసాగనుంది.