మహారాష్ట్ర(Maharastra)లో మరాఠా రిజర్వేషన్(Marata regervation) కల్పించడానికి అఖిలపక్షం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించడానికి ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్‌లలో మార్పులు తీసుకురాకూడదని అఖిలపక్షం సూచించిందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ఈ రిజర్వేషన్ కోసం చేస్తున్న నిరాహార దీక్షను మనోజ్ జరాంగే(Manoj Jaraange) విరమించాలని సీఎం కోరారు.
మరాఠా ప్రజలకు రిజర్వేషన్ కల్పించాలని మహారాష్ట్రలో జరిగిన అఖిలపక్ష సమావేశం మరోసారి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మరాఠా రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష సాగిస్తున్న జాల్నాకు చెందిన హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్‌ను తన దీక్షను ఉపసంహరించుకోవలసిందిగా కూడా అఖిలపక్ష సమావేశం విజ్ఞప్తి చేసింది.
హింసాకాండ, దహనకాండ కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితిపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. మరాఠా ప్రజలకు రిజర్వేషన్ కల్పించాలని సమావేశం తీర్మానించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విలేకరులకు తెలిపారు. ఇతర కులాలలకు చెందిన రిజర్వేషన్లు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందని, అంతవరకు అందరూ సహనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
మరాఠా కోటా ఉద్యమంతో మహారాష్ట్ర రగిలిపోయింది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులను దిగ్బంధించారు. పలు చోట్ల ప్రభుత్వ, బీజేపీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఈ మేరకు మరాఠా రిజర్వేషన్ అమలుకు ఆమోదం తెలిపింది.