మెదక్ (Medak) పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, బీజేపీ (BJP) అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలతో ఢి కొంటున్నారు.. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక కోట మైసమ్మ ఆలయం నుంచి ఇంద్ర పార్క్ చౌరస్తా దాకా రోడ్ షో లో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ ప్రజలకు డబల్ బెడ్రూం లేవు కానీ ఆయన ఇంట్లో 30 డబల్ బెడ్రూంలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.. ప్రజలను రోడ్డు పాలు చేసి ఆయన మాత్రం రాజ్ పుష్పలో ఇండ్లు కట్టుకోని వైభోగాలు అనుభవిస్తున్నారని విమర్శించారు.. పదేళ్లు కలెక్టర్ గా ఉండి రింగ్ రోడ్డు పక్కన పది ఎకరాలు కొన్నాడని రఘునందన్ ఆరోపణలు చేశారు..
మామ అల్లుడు 10 ఏండ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో తెలుపాలని డిమాండ్ చేసిన రఘునందన్.. ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు వంద కోట్లు ఇయ్యనోడు ఇప్పుడు ఇస్తా అని ప్రజల చెవి లో పువ్వు పెడుతుండని మండిపడ్డారు.. అలాగే రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షలు ఇస్తానని చెప్పి ఇయ్యలేదు కానీ 20 సార్లు ఢిల్లీకి పోయిండని అన్నారు.. హోలీ పండగ రోజు చెంగి చెర్లలో సంబరాలు జరుపుకుంటున్న వారి పై ఓ మతానికి చెందిన వారు దాడి చేయడం సమంజసమా అని ప్రశ్నించారు.
మన ఊర్లో మన ఇంటి దగ్గర పండగ చేసుకుంటే ఇలా జరిగితే భవిష్యత్తులో ఏమైతదో మనం ఆలోచించుకోవాలని సూచించారు.. దేశంలో నూటికి 80 శాతం జనాభా ఉన్నా మనం నోరు మూసుకొని ఉండాలంటా, నూటికి 10 శాతం ఉన్నా వాళ్ళు మాత్రం పండగలు చేసుకోవాలంటా అని రఘునందన్ ధ్వజమెత్తారు.. రైతులకు కొరత లేకుండా ఎరువులు ఇస్తున్న మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని సూచించారు..
మరోవైపు వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy)లా తులం బంగారం ఇయ్యలేను కానీ మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతానని తెలిపిన రఘునందన్ (Raghunandan).. తెలంగాణ ఉద్యమకారులకు కాకుండా కేసీఆర్ (KCR) కాళ్ళు మొక్కి ఫ్రీగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకొన్నారని ఆరోపించారు..