Telugu News » Telangana : ప్రజలకు శుభ వార్త అంటున్న ఐఎండీ.. కరుణించనున్న వరుణుడు..!

Telangana : ప్రజలకు శుభ వార్త అంటున్న ఐఎండీ.. కరుణించనున్న వరుణుడు..!

ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ పరిస్థితులు, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విస్తృతి వల్ల ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు..

by Venu
Rains

భారత వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. దేశంలో ఈఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం (Rainfall) నమోదు అవుతుందని అంచనా వేసింది. దీర్ఘకాల సగటు LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది.. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు-సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది.

Rain Alert: అదేవిధంగా వచ్చే సీజన్‌లో LPA 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఐఎండీ (IMD) పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్​లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

మరోవైపు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. జూన్‌ నాటికి ఎల్‌నినో బలహీనపడనుందని తెలిపారు.. మే నెల నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్‌ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. జులై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున మంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు..

అలాగే ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ పరిస్థితులు, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విస్తృతి వల్ల ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.. మరోవైపు ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ఇటీవల అంచనా వేసింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిల్లీమీటర్లలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది.

You may also like

Leave a Comment