పవన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ నేతలున్నట్లు మొదటి నుంచి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో ఒక్కొక్కరిని బయటకు లాగుచున్న అధికారులు.. ఈ కేసులో పూటకో ట్విస్ట్ ఇస్తున్నారు. కాగా తాజాగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఆధారంగా వెంకటరామిరెడ్డిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేయాలని మెదక్ బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) కోరారు.
మెదక్ (Medak) బీఆర్ఎస్ (BRS) ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకట రామిరెడ్డి (Venkata Ramireddy)పై రఘునందన్ ఈడీకి ఫిర్యాదు చేశారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెల్లపూర్ లో ఆయన నివాసం రాజపుష్ప నుంచి కోట్ల రూపాయలు ఎన్నికల కోసం వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడి ఎన్నికల్లో కర్మ, కర్త, క్రియ అయిన రామిరెడ్డి ఎవరి ఆదేశాల ప్రకారం నడుచుకొన్నారో అనే నిజాలు బయటకు తీయాలని అన్నారు..
రాధాకిషన్ రావు చెప్పిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఆధారంగా వెంకటరామిరెడ్డి పై ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు. అలాగే మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.. ఇదిలా ఉండగా నేడు సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్లో ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు నమోదైంది. సిద్దిపేటలో ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఎంపీ అభ్యర్థితోపాటు మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏప్రిల్ 7న కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో వెంకటరామ్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. వీరు మీటింగ్ జరిగే చోటుకు వెళ్ళగా వెంకటరామిరెడ్డి తో పాటు ఉద్యోగులు అక్కడి నుంచి పరారయ్యారని సమాచారం. అయితే ఈ భేటీ దాదాపు అర్ధరాత్రి వరకు సాగిందని తెలుస్తోంది..