మేడారం (Medaram) సమక్క సారలమ్మ జాతర ప్రారంభానికి ముందే భక్తుల తాకిడి భారీగా పెరిగింది. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న వాహనాలతో ప్రధాన దారులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. ఇదే సమయంలో భక్తుల పర్సు ఖాళీ చేయడానికి టోల్ గేటు సిబ్బంది సిద్దం అయ్యినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు టోల్, పర్యావరణ ఛార్జీ, పార్కింగ్ రుసుముల వసూళ్లతో బెంబేలెత్తుతున్నారు.
మరోవైపు జాతీయ రహదారుల వెంట సాధారణంగా 50 కిలోమీటర్ల పరిధిలో ఒక టోల్‌గేట్ ఉంటుంది. కానీ మేడారంలో సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma) దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల నుంచి టోల్‌తో పాటు పర్యావరణ ఛార్జీ, పార్కింగ్ రుసుములు వసూలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. దీంతో 45 కిలోమీటర్ల పరిధిలోనే మూడు చోట్ల ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు..
ఇప్పటికే సమక్క, సారలమ్మ జాతరకు భారీగా ప్రైవేట్ వాహనాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో పార్కింగ్, టోల్ రుసుములతో పాటు అటవీశాఖ ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ ఛార్జీలు వసూలు చేస్తోంది. మరోవైపు అటవీ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు.. వన్యప్రాణుల రక్షణకు వినియోగించేందుకు ఈ రుసుమును వసూలు చేస్తున్నట్లు అధికారులు వివరణ ఇచ్చుకొంటున్నారు..
ఇక వరంగల్ (Warangal) నుంచి మేడారం వెళ్ళేవారు మూడుచోట్ల రుసుములు చెల్లించాల్సి ఉండగా.. హైదరాబాద్ (Hyderabad) నుంచి వచ్చే వారికి మరో మూడు టోల్‌గేట్లు అదనంగా ఉండటంతో భక్తుల జేబులకు భారీగా చిల్లులుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాతరకు వచ్చే వాహనాల వల్ల తనిఖీ కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఉత్పనమయ్యే ప్రమాదం ఉంది. దీంతో జాతర పూర్తయ్యే వరకైనా టోల్ వంటి వాటిని నిలిపివేస్తే తమకు కాస్త ఊరట కలుగుతుందని భక్తులు కోరుతున్నారు.. వారి అభ్యర్థనకు స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు..