బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)కి అధికారులు ఊహించని షాకిచ్చారు. గుండ్ల పోచంపల్లి (Gundla Pochampally) మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ (HMDA) లే అవుట్లో సుమారు 2500 గజాల భూమిని ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డును అధికారులు తొలగించారు. మేడ్చల్ (Medchal) కలెక్టర్ ఆదేశాలతో నేడు అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు..
మరోవైపు గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ వ్యహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.. ఇదిలా ఉండగా దీనిపై మల్లారెడ్డి స్పందించారు.
తనను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారని ఆరోపించారు. తనపై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు.. రోడ్డు వేసే సమయంలో హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. కాగా రోడ్డుకు ఉపయోగించిన 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా మరో స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామని మల్లారెడ్డి వెల్లడించారు..
హఠాత్తుగా కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.. కావున ప్రభుత్వం ట్రాఫిక్ సమస్య, విద్యార్థుల జీవితాల్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు.