ఏపీలో ప్రస్తుతం దేవాలయాల ( Temples) పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా మారిందని ఆద్యాత్మిక వేత్త దర్శనపు శ్రీనివాస్ (Darshanapu Srinivas) తెలిపారు. రాష్ట్రంలో పలు దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్నాయని చెప్పారు.
గుంటూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. రాష్ట్రంలో దేవాలయ వ్యవస్థను బాగు చేసేందుకు, మత మార్పిడులు ఇతర సమస్యలపై పోరాటం చేసేందుకు హిందూ దేవాలయాల విమోచన సమితి పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.
ఈ మేరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏలూరులో కూడా సభను ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమంలో తీర్మానం చేసినట్టు వివరించారు. ఇలాంటి హిందూ ధర్మ పోరాటానికి పెద్దలందరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ సభకు చేదులూరి గౌరయ్య గౌరవ అధ్యక్షులుగా, దర్శనపు శ్రీనివాస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి హిందూ సంఘాల నేతలు హాజరయ్యారు. ఇక నుంచి హిందూ దేవాలయాల విమోచన సమితి ద్వారా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.